ఆంగ్ల మాధ్యమం అందరి కోరిక – Namasthe Telangana

ప్రభుత్వ పాఠ్యపుస్తకాల రచయిత, ఎన్సీఈఆర్టీ జనరల్‌ బాడీ పూర్వ సభ్యుడు, తెలుగు తప్పనిసరి అమలు కమిటీ సభ్యుడు, రీడింగ్‌ క్యాంపెయిన్‌ స్టేట్‌ కోఆర్డినేటర్‌, కరిక్యులమ్‌ రూపకల్పన, పరీక్షల సంస్కరణల కమిటీ సభ్యుడు సువర్ణ వినాయక్‌ ప్రత్యేక కథనం…
‘మున్ముందు సమాజంలో రెండే కులాలుంటాయి.. ఒకటి ఇంగ్లిష్‌ వచ్చిన వాడు – రాని వాడు, టెక్నాలజీ తెలిసినవాడు- తెలియని వాడు’ అని విశ్లేషించాడు ఒక సామాజిక వేత్త. ప్రజలెప్పుడూ తమ తక్షణ సమస్యలపైనే ప్రధానంగా దృష్టి పెడతారు.సమర్థులైన పాలకులు మాత్రం దీర్ఘకాలంలో ప్రజలకు ఏం అవసరమవుతాయి? వాటిని ఎలా తీర్చాలి? అనే ముందు చూపుతో వ్యవహరిస్తారు. చైనా, సింగపూర్‌, జపాన్‌ తదితర దేశాల పాలకులు క్రాంత దర్శనం చేసినందువల్లే ఆయా దేశాలు అనతి కాలంలోనే అభివృద్ధి చెందిన దేశాలుగా మారాయి. ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన తర్వాత ఇంగ్లిష్‌ ఒక అనివార్యత అయిపోయింది. ఇది కాదనలేని సత్యం. ఆ ప్రధాన స్రవంతిలో మనం కలువాలా? విడిగా ఒంటరిగా మిగిలి పోవాలా? అనేది మనకు మనం తేల్చుకోవాల్సిందే. ఇంగ్లిష్‌ రాకపోవడం అనేది ఒక సామాజిక అంతరంగా, ఆర్థిక అసమానతగా పరిణమించి పిల్లల్లో న్యూనతకు కారణమవుతున్నప్పుడు మనం దిద్దుబాటుకు దిగి, మన వారసులను భవిష్యత్తు సవాళ్లకు సన్నద్ధం చేయడమొక్కటే కర్తవ్యం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం సరిగ్గా ఇదే. ప్రభుత్వ బడులు ఆంగ్ల మాధ్యమానికి సన్నద్ధంగా ఉన్నాయా, టీచర్లు పాఠాలు చెప్పగలరా? పిల్లలు ఇంగ్లిష్‌ నేర్చుకోగలరా? అన్న సందేహ పక్షుల సంశయాలకు సమాధానంగా విద్యారంగ నిపుణుడు సువర్ణ వినాయక్‌ రాసిన వ్యాసం రెండో భాగం
పిల్లల పరంగా ఆలోచించినపుడు పిల్లలు సహజంగా అమితమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నారనేది వాస్తవం. పిల్లలు పుట్టుకతోనే నేర్చుకొనే సత్తా కలిగి ఉన్నారు. 3 సంవత్సరాల పిల్లలు కూడా బహు భాషలను నేర్చుకొనే సత్తా కలిగి ఉన్నారని అనేక పరిశోధనలు నిరూపించాయి. ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకొంటున్న పిల్లల్లో మేధో శక్తి వికాసం మరింత ఎక్కువగా ఉంటుందని 2005 జాతీయ విద్యా ప్రణాళికా చట్రం, 2020 జాతీయ విద్యా విధానం కూడా ఇదే విషయాన్ని ఉద్ఘాటించాయి. అవకాశం కల్పించి, ప్రోత్సహిస్తే ఎన్నో శక్తి సామర్థ్యాలున్న పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో నేర్చుకోవడం ఇబ్బంది కాదని భావించవచ్చు. ఇది వారికి కల్పించే బోధనాభ్యసన కార్యకలాపాలు, వారిని భాగస్వాములను చేయడం, వారి నేపథ్యాన్ని అర్థం చేసుకోవడం, ప్రోత్సహించడం అభ్యాసంతో ముడిపడి ఉన్న అంశం. ఉపాధ్యాయుల పరంగా ఆలోచించినపుడు ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ ఉపాధ్యాయులు అత్యున్నత విద్యార్హతలు, ప్రతిభ, అనుభవం కలిగి ఉన్నవారు. ఉపాధ్యాయులు నిరంతరం అభ్యాసకులు కూడా! వారు ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక బోధనా విధానాలకు అలవాటుపడడానికి అధ్యయనం చేయాల్సిన వృత్తి ధర్మాన్ని కూడా కలిగి ఉన్నవారు. తప్పనిసరని భావించినపుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు వారు తమ శక్తి సామర్థ్యాలు నిరూపించుకొన్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇందుకు ఉదాహరణగా కరోనా సంక్షోభ సమయంలో తమను తాము సాంకేతికంగా వృద్ధిపరుచుకొని ఆన్‌లైన్‌ బోధన ద్వారా చేసిన కృషిని పేర్కొనవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం లేనివారు సైతం సాంకేతికతను నేర్చుకొని ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలను బోధించడం, సామగ్రిని రూపొందించడం వంటివి చేశారు. ఎన్నో పాఠశాలల్లో ఉపాధ్యాయులు తమ కృషి ద్వారా విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేసి, అద్భుతమైన ఫలితాలను సాధించిన ఘటనలు కూడా కోకొల్లలు.

వాటిని విశ్లేషిస్తే 3 అంశాలు గోచరిస్తాయి.
మన రాష్ట్రంలోని 18,233 ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటికే 6,226 పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తున్నాయి. 3,151 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,536 పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంగా మారినవి. 4,688 ఉన్నత పాఠశాలలకు గాను 2,942 పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో పిల్లలకు బోధిస్తున్నారు. ఇవన్నీ కేవలం ప్రభుత్వ యాజమాన్యంలోని స్థానిక సంస్థలు, ప్రభుత్వం అధీనంలోనివే! గురుకులాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, మోడల్‌ సూల్స్‌ అన్నీ ఇప్పటికే ఆంగ్ల మాధ్యమం బాటలో కొనసాగుతున్నాయి. అనగా ఉన్నత పాఠశాలల్లో మిగిలిన 1,746 పాఠశాలల్లో, ప్రాథమికోన్నత స్థాయిలో 1,615 పాఠశాలల్లో, ప్రాథమిక స్థాయిలో 12,007 పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభిస్తారని అర్థం. ఇది కూడా తెలుగు మాధ్యమంతో సమాంతరంగా మాత్రమే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నారు. దీని వల్ల తల్లిదండ్రులు తమ పిల్లల కోసం అభిరుచి ప్రకారం మాధ్యమాన్ని ఎంపిక చేసుకొనే వెసులుబాటు కూడా కలిగింది.
ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికే సమాంతరంగా సక్సెస్‌ స్కూళ్ల పేరుతో ఆంగ్ల మాధ్యమం నిర్వహిస్తున్నందువల్ల ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి అలవాటుపడి ఉన్నారు. అలాగే తమ పాఠశాలలను కాపాడుకోవడానికి గత కొద్ది సంవత్సరాలుగా ఆంగ్ల మాధ్యమ ఆవశ్యకతను గుర్తించి, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల్లో పడిపోతున్న నమోదును పెంచుకోవడానికి ఉపాధ్యాయులు చేయని ప్రయత్నం లేదంటే అతిశయోక్తి కాదు. వారు అనధికారికంగా కూడా కొన్నిచోట్ల తల్లిదండ్రుల డిమాండ్‌కు అనుగుణంగా ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్న సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ‘రోగి కోరేది.. డాక్టరిచ్చే వైద్యం ఒకటే!’ అన్నట్లుగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలకు అనుగుణంగానే ఆంగ్ల మాధ్యమ నిర్ణయం చోటు చేసుకుందని భావించవచ్చు. అయితే ఉపాధ్యాయుల ఆంగ్ల భాషా బోధన సామర్థ్యాలను పెంపొందించడం పట్ల వ్యవస్థాపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
విద్యార్థులకు లోతైన విషయావగాహన పెంపొందింపజేయడంలో మాధ్యమం కంటే కూడా ఉపాధ్యాయుల బోధనా విధానాలు, వ్యూహాలు, విద్యార్థులకు కల్పించే అవకాశాలు, వారిని నమ్మి ప్రోత్సహించే విధానాలే ముఖ్య పాత్ర పోషిస్తాయనేది అతి ముఖ్యమైనది. యాంత్రిక బోధన ఏ మాధ్యమంలో జరిగినా ఒనగూరే ప్రయోజనం శూన్యం! ఆంగ్ల భాషా మాధ్యమాన్ని దశల వారీగా ప్రవేశపెట్టడం ద్వారా ఉపాధ్యాయులు, పిల్లలు దీనికి అలవడేలా చేయవచ్చు. ఆంగ్ల భాషా మాధ్యమం అభ్యసించడంలో పాఠ్యపుస్తకాల పాత్ర కూడా కీలకమైనది. మాతృ భాషేతర మాధ్యమంలో నేర్చుకొనే విద్యార్థులకు ద్విభాషా బోధనతో పాటు (బైలింగ్వల్‌ టీచింగ్‌), ద్విభాషా వాచకాలు (బైలింగ్వల్‌ టెక్స్‌ బుక్స్‌) కూడా తోడ్పడతాయని జాతీయ విద్యా విధానం 2020 కూడా పేర్కొన్నది. ఇప్పటికే రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎసీఈఆర్టీ) ఇందుకు శ్రీకారం చుట్టింది. ఇది ఇటు ఉపాధ్యాయులకు, అటు విద్యార్థులకు ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. మారిన సామాజిక పరిణామాల నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమం ప్రాధాన్యాన్ని అవగతం చేసుకున్న ఉపాధ్యాయులు తమ బోధనా సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడం గురించి సందేహించాల్సిన అవసరం లేదు. అయితే ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నపుడు పిల్లల అవసరాలకు అనుగుణంగా వారి అభ్యసనా స్థాయిని గుర్తించి, ఆంగ్ల భాషలో ప్రాథమిక భావనలతో ప్రారంభించి క్రమేపీ అభ్యసనాస్థాయిని పెంచే దిశగా కృషి చేయాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, వనరులను కూడా వినియోగించాల్సి ఉంటుంది. ఆంగ్ల మాధ్యమంలో నేర్చుకొనే సబ్జెక్టులలో ప్రధానమైనవి భాషేతర సబ్జెక్టులు. వీటిలో గణితానికి భాషాపరమైన సమస్య ఎక్కువగా ఉత్పన్నం కాదు. సాంఘికశాస్త్రం, విజ్ఞానశాస్ర్తాల అభ్యసనాన్ని విద్యార్థుల ఆంగ్ల భాషా భావప్రసార నైపుణ్యాలు ప్రభావితం చేస్తాయి. దీనిని అధిగమించడానికి భాషేతర సబ్జెక్టులను సులభంగా అభ్యసించడానికి ఆంగ్ల భాషా సబ్జెక్టు బోధనలో భాషా సామర్థ్యాల సాధన జరిగేలా ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఆంగ్ల భాషా అభ్యసనంతోనే ఆంగ్ల భాషా మాధ్యమంలో అభ్యసనం ముడిపడి ఉంటుందని గ్రహించాలి. ఇందుకు అవసరమైన విధి విధానాలను ప్రాథమిక స్థాయి నుంచే పటిష్టంగా అమలుపర్చాలి.
సహజంగా ఆంగ్ల భాషా మాధ్యమం వల్ల తెలుగుకు ముప్పు వాటిల్లుతుందని సందేహించడం సహజం. అయితే ఆంగ్ల భాషా మాధ్యమం అనివార్యమైనప్పటికీ భాషా సాంస్కృతిక కార్యక్రమాలను పాఠశాల కేంద్రంగా నిర్వహించడం ద్వారా తెలుగు భాషను పరిరక్షించుకోవచ్చు. తెలుగు వినియోగాన్ని నిరోధించకుండా గ్రంథాలయ పుస్తకాలను చదివించడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, పిల్లలు భాషాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం ద్వారా తెలుగును పటిష్టపర్చుకోవచ్చు. ఉదాహరణకు విలువల విద్య, నైతిక బోధన వంటి అంశాలకు చెందిన పుస్తకాలను, బాల సాహిత్యాన్ని, కథల పుస్తకాలను వినియోగించేటట్టుగా పాఠశాలలో చర్యలు చేపట్టవచ్చు. విద్యాభారతికి అనుబంధంగా ఉభయ తెలుగు రాష్ర్టాల్లో నిర్వహిస్తున్న పాఠశాలలు కూడా మారిన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తమ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమంగా మార్చి నిర్వహిస్తుండటం గమనించాలి. మాతృభాషకు, సంస్కృతి సంప్రదాయాలకు కేంద్రాలుగా భావించే ఈ పాఠశాలలు సైతం ఆంగ్ల మాధ్యమంలోకి పరివర్తన చెందటానికి గల కారణాలను విశ్లేషించుకుంటే విషయం బోధపడుతుంది.
2020 జాతీయ విద్యావిధానం ఎలిమెంటరీ స్థాయి వరకు మాతృభాషలో విద్యాబోధన జరుగాలని సూచించింది. అయితే, 2009 నిర్బంధ ఉచిత విద్యాహక్కు చట్టం ద్వారా మాతృభాషలో విద్యాబోధన అనే అంశానికి ఎదురైన అడ్డంకులను అర్థం చేసుకుంటే ఎంత ఆచరణ కష్టమో అవగాహన అవుతుంది.
సాధారణంగా ప్రైవేటు యాజమాన్యాలలో తెలుగుకు సరైన ప్రాధాన్యం ఇవ్వకుండా యాంత్రికంగా బోధిస్తారనే అపవాదు ఉన్నది. కానీ.. తప్పనిసరి తెలుగు అమలు చట్టం ప్రకారం ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అవసరమైతే భవిష్యత్తులో ప్రాథమిక స్థాయి నుంచే ప్రత్యేకంగా తెలుగు భాషను బోధించడానికి ఉపాధ్యాయులను నియమించే అవకాశాన్ని కూడా పరిశీలించచవచ్చు.
(ఆంగ్ల మాధ్యమం అమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు రేపటి సంచికలో..)
# 8-2-603/1/7,8&9, Krishnapuram,
Road No. 10, Banjara Hills,
Telangana – 500034.
Phone: +91 40 2329 1999
Website: +91-40-23291162
[email protected]
Print Edition:
04023291103, 04023291122
The content of this site are © 2022 Telangana Publications pvt. Ltd

source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *