గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి… భారత్ దీనికి ప్రపంచ కేంద్రంగా అవతరించగలదా? – BBC News

ఫొటో సోర్స్, Getty Images
గ్రీన్ హైడ్రోజన్ తో కాలుష్యాన్ని తగ్గించవచ్చు
గ్రీన్ హైడ్రోజన్ అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సెషన్‌లో మాట్లాడిన పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరి, గ్రీన్ హైడ్రోజన్ రంగంలో భారతదేశం అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు.
శక్తి వనరులుగా ఎక్కువగా శిలాజ ఇంధనాలపై ఆధారపడే దేశానికి ఇది చాలా పెద్ద విషయం.
ప్రపంచవ్యాప్తంగా నెట్ జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యం విషయంలో పెరుగుతున్న ఒత్తిడి కారణంగా, క్లీన్ ఎనర్జీకి సంబంధించి భారతదేశం కూడా దూకుడు విధానాన్ని తీసుకుంది.
రాబోయే కొన్నేళ్లలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే దేశాల్లో అగ్రగామిగా ఉండాలని భారత్ కోరుకుంటోంది. మోదీ ప్రభుత్వం ఈ ఏడాది జాతీయ హైడ్రోజన్ పాలసీని ప్రకటించింది.
భారతదేశ తలసరి కార్బన్ ఉద్గార రేటు చాలా తక్కువగా ఉంది. నెట్ జీరో ఉద్గారాల లక్ష్యానికి గడువును 2050 నుండి 2070 వరకు పెంచింది.
అయితే ప్రపంచ వ్యాప్తంగా కర్బన ఉద్గారాలకు సంబంధించి కఠినమైన ప్రమాణాలు, ఈయూ దేశాలకు ఎగుమతి చేసే వస్తువుల పై గ్రీన్ ట్యాక్స్ వంటి నియమాలు భారతదేశాన్ని ప్రేరేపించాయి. దీంతో గ్రీన్ హైడ్రోజన్ గురించి తీవ్రమైన ఆలోచనలు మొదలయ్యయి.
కార్బన్ ఫ్రీ హైడ్రోజన్ లేదా గ్రీన్ హైడ్రోజన్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. పరివర్తన ఇంధనంగా ఉపయోగించే సహజ వాయువు (CNG) బొగ్గు, డీజిల్, భారీ ఇంధన చమురు కంటే క్లీన్ ఎనర్జీగా పేరు తెచ్చుకుంది.
25 ఏళ్లు కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా పెళ్లి కానుకను ఇచ్చిన తండ్రి
అంతేకాదు, ఇది భూఉష్ణోగ్రతను పారిశ్రామికీకరణకు పూర్వపు స్థాయి కంటే 1.5 నుండి 2 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయగలదు. దీంతోపాటు ప్రస్తుతం వాతావరణ మార్పులను పెద్ద ఎత్తున అరికట్టాల్సిన అవసరం ఉంది.
భారతదేశం ఈ ఏడాది ఫిబ్రవరిలో నేషనల్ హైడ్రోజన్ మిషన్‌ను ప్రకటించింది. దీని ప్రకారం, 2030 నాటికి భారతదేశం ప్రతి సంవత్సరం ఐదు మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను తయారు చేయగలగాలి. గ్రీన్ హైడ్రోజన్‌ను తయారు చేయడానికి నీరు, తక్కువ విద్యుత్ అవసరం.
భారత్‌లో ఈ రెండు వనరులు ఉన్నాయి. ఇండియాకు చాలా పొడవైన తీర ప్రాంతం ఉంది. సూర్యరశ్మి కూడా పుష్కలంగా ఉంది. సౌర విద్యుత్, సముద్రపు నీరు గ్రీన్ హైడ్రోజన్‌ను తయారు చేయడంలో సహాయకారిగా ఉంటాయి.
భారతదేశం ఒక అడుగు ముందుకు వేసి గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మారడానికి ప్రణాళికలు వేస్తోంది.
ఫొటో సోర్స్, Getty Images
మంత్రి హర్‌దీప్ పూరి
గ్రీన్ హైడ్రోజన్ అనేది ఒక రకమైన స్వచ్ఛమైన శక్తి. ఇది సోలార్ పవర్ వంటి పునరుత్పాదక శక్తిని ఉపయోగించి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విభజించడం ద్వారా ఉత్పత్తి చేస్తుంది.
నీటి ద్వారా విద్యుత్ ను పంపినప్పుడు హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. ఈ హైడ్రోజన్ అనేక సందర్భాలలో శక్తిగా పని చేస్తుంది.
హైడ్రోజన్‌ను తయారు చేయడానికి ఉపయోగించే విద్యుత్తు పునరుత్పాదక ఇంధన వనరుల నుండి వస్తుంది. కనుక ఇది కాలుష్యాన్ని కలిగించదు. అందుకే దీనిని గ్రీన్ హైడ్రోజన్ అంటారు.
చమురు శుద్ధి, ఎరువులు, ఉక్కు, సిమెంట్ వంటి కార్బన్ రహిత భారీ పరిశ్రమలకు ఇది సహాయపడుతుందని పర్యావరణవేత్తలు పేర్కొన్నారు. అందువల్ల, ఇది ప్రపంచ కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో కూడా సహాయ పడుతుందని అర్ధం చేసుకోవచ్చు.
ఫొటో సోర్స్, Getty Images
ఉక్కు పరిశ్రమలో గ్రీన్ హైడ్రోజన్ ఎక్కువగా ఉపయోగపడుతుంది
భారత్‌లో గ్రీన్ హైడ్రోజన్ డిమాండ్, ధర?
హైడ్రోజన్ రంగులేని వాయువు. గ్రీన్ హైడ్రోజన్ ఒక్కటే క్లీన్ ఎనర్జీగా పేరు తెచ్చుకుంది. దీనిని పునరుత్పాదక శక్తిని(రెన్యూవబుల్ ) ఉపయోగించి తయారు చేస్తారు.
ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (TERI-టెరీ) ప్రకారం, 2020 సంవత్సరంలో భారతదేశంలో శిలాజ ఇంధనాల నుండి 6 మిలియన్ టన్నుల గ్రే హైడ్రోజన్ ఉత్పత్తి అయ్యింది.
2050 నాటికి భారతదేశంలో హైడ్రోజన్ డిమాండ్ ఐదు రెట్లు పెరుగుతుంది. కానీ, శిలాజ ఇంధనాల కంటే 50 శాతం చౌకగా మారినప్పుడు మాత్రమే గ్రీన్ హైడ్రోజన్ వల్ల ప్రయోజనం ఉంటుంది.
భారతదేశంలో ప్రస్తుతం వ్యవస్థాపిత పునరుత్పాదక ఇంధనం 40 శాతం వాటా ఉంది. చైనా, అమెరికా తర్వాత అత్యధికంగా ముడి చమురును దిగుమతి చేసుకునేది భారతదేశమే.
కానీ పెద్ద ఎత్తున నిల్వ సామర్ధ్యం లేకుండా, పునరుత్పాదక శక్తి సంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయం కాదు. అంటే పునరుత్పాదక ఇంధనం కోసం నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం అవసరం. అప్పుడే అది పెద్ద ఎత్తున ఉపయోగించుకునే అవకాశం ఉంది.
లిథియం బ్యాటరీలు పెద్ద ఎత్తున విద్యుత్‌ను నిల్వ చేయలేవు. అయితే, ప్రస్తుతం వీటిని ఎలక్ట్రిక్ వాహనాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు.
అందుకు భిన్నంగా గ్రీన్ హైడ్రోజన్ చాలా పెద్ద పరిమాణంలో నిల్వ చేయడం వీలవుతుంది. ఇది సుదూరం ప్రయాణించే ట్రక్కులు, బ్యాటరీతో నడిచే కార్లు, పెద్ద పెద్ద సరుకు రవాణా నౌకలు, రైళ్లకు అద్భుతమైన శక్తి వనరుగా ఉపయోగపడుతుంది.
ఫొటో సోర్స్, Getty Images
శిలాజ ఇంధనాలతో పనిచేసే పరిశ్రమల వల్ల కాలుష్యం పెరుగుతుంది
భారత ప్రభుత్వం తన గ్రీన్ హైడ్రోజన్ పాలసీ కింద పరిశోధనతోపాటు ఇతర అవసరాలకు నిధులు అందజేస్తామని ప్రకటించింది. దీని కోసం, చౌకైన పునరుత్పాదక శక్తితో అంతర్-రాష్ట్ర విద్యుత్ ప్రసారానికి 25 సంవత్సరాల వరకు మినహాయింపు నిబంధన ఉంది.
అయితే, జూన్ 2025లోపు ప్రారంభమయ్యే ప్రాజెక్ట్‌ లకు మాత్రమే ఈ మినహాయింపు అందుబాటులో ఉంటుంది. గ్రీన్ హైడ్రోజన్ లేదా గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ రెన్యూవబుల్ ఎనర్జీ కొనుగోలు కోసం దరఖాస్తు అందిన 15 రోజులలోపు ఓపెన్ యాక్సెస్ ఇస్తారు.
ప్రభుత్వ రిబేట్ విధానాల తర్వాత, దేశంలోని అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ ప్రకటన చేసింది.
2029-30 నాటికి భారతదేశంలో హైడ్రోజన్ డిమాండ్ 11.7 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా.
ప్రస్తుతం దీని డిమాండ్ 67 లక్షల టన్నులు. ఈ 67 లక్షల టన్నులలో దాదాపు 36 లక్షల టన్నులు అంటే 54 శాతం పెట్రోలియం శుద్ధిలో ఉపయోగిస్తున్నారు. మిగిలినవి ఎరువుల తయారీలో వినియోగిస్తారు.
ఇది గ్రే హైడ్రోజన్, సహజ వాయువు లేదా నాఫ్తా నుండి తయారవుతుంది. సహజంగానే, ఇది చాలా కాలుష్యానికి కారణమవుతుంది. కాబట్టి భారతదేశపు కార్బన్ ఉద్గారాల తగ్గింపు లక్ష్యంలో ఇది ప్రధాన అడ్డంకి.
సముద్రంలో తేలియాడే సోలార్ ప్యానెళ్లు చూశారా?
కర్బన ఉద్గారాలను గ్రీన్ హైడ్రోజన్ తగ్గిస్తుందా?
గ్రీన్ హైడ్రోజన్ కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో చాలా సహాయకారిగా ఉంటుంది. ఉదాహరణకు, ఉక్కు, ఇనుము అత్యంత కాలుష్య పరిశ్రమలలో ఒకటి. ప్రపంచంలోని మొత్తం గ్రీన్‌హౌస్ ఉద్గారాలలో ఇది ఏడు శాతం. కార్ల తయారీ నుండి వంతెనల నిర్మాణం వరకు ఉక్కును విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
ఉక్కు పరిశ్రమ గ్రీన్ హైడ్రోజన్‌ను ఉపయోగించడం ప్రారంభించినట్లయితే, ఈ కార్బన్ ఉద్గారాలు దాదాపుగా తొలగిపోతాయి. భారతదేశంలో కాలుష్య నియంత్రణ పరంగా ఇది పెద్ద విజయం అవుతుంది.
దురయ్యే సవాళ్లు ఏంటి?
భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చౌకగా ఉన్నప్పుడే దాని వినియోగం పెరుగుతుంది. అంటే, ఉక్కు, సిమెంట్, ఆటోమొబైల్ పరిశ్రమలు తమ ఖర్చును అదుపులో ఉంచుకుంటేనే దానిని ఉపయోగించకోగలుగుతాయి.
ప్రస్తుతం, గ్రీన్ హైడ్రోజన్‌తో తయారు చేసిన ఉక్కు, సంప్రదాయ ఇంధనంతో తయారు చేసిన ఉక్కుకంటే 50 నుండి 127 శాతం ఎక్కువ ఖర్చు అవుతుంది.
ప్రస్తుతం భారతదేశంలో హైడ్రోజన్ ధర కిలో రూ.340 నుంచి రూ.400 వరకు ఉంది. పరిశ్రమలో గ్రీన్ హైడ్రోజన్ వినియోగం పెరుగుతుంటే దాని ధర కిలో రూ.150కి చేరింది.
రిఫైనరీ, ఎరువులు, ఉక్కు పరిశ్రమలు హైడ్రోజన్ వినియోగదారుల్లో అగ్రగాములు. ఈ పరిశ్రమలతో పాటు, విద్యుత్ ఉత్పత్తి, హైడ్రోజన్ నిల్వ, మూవింగ్ ఇండస్ట్రీస్ (బ్యాటరీతో నడిచే కార్లు, ట్రక్ లు, బస్సులు, నౌకలు) లాంటివి చౌకగా హైడ్రోజన్ ఉత్పత్తి కోసం రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కార్యకలాపాలను కూడా పెంచాయి.
ఫొటో సోర్స్, Getty Images
ఇండియాలో పలు పెద్ద కంపెనీలు గ్రీన్ హైడ్రోజన్ తయారీకి ముందుకు వస్తున్నాయి
సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం దేశంలోని అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో $75 బిలియన్ల( సుమారు రూ.5820412500000) పెట్టుబడిని ప్రకటించింది. అయితే గ్రీన్ హైడ్రోజన్‌ పై ఎంత పెట్టుబడి పెట్టనున్నదీ కంపెనీ వెల్లడించలేదు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌కో గ్రూప్, బెల్జియన్ కంపెనీ జాన్ కాక్రిల్ భారతదేశంలో రెండు గిగావాట్ల సామర్థ్యంతో హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ గ్రూప్ చైనా వెలుపల ఏర్పాటు చేసిన అతిపెద్ద ఫ్యాక్టరీ ఇదే.
మార్చిలో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్రీన్ హైడ్రోజన్‌ను తయారు చేయడానికి రెండు ప్రైవేట్ కంపెనీలతో పరస్పర సహకారాన్ని ప్రకటించింది. ఈ కంపెనీలు గ్రీన్ హైడ్రోజన్‌ను తయారు చేయడానికి ఉపయోగించే ఎలక్ట్రోలైజర్‌లను కూడా తయారు చేస్తామని ప్రకటించాయి.
ప్రపంచంలోనే అత్యంత చవకైన హైడ్రోజన్‌ను తయారు చేస్తామని రిలయన్స్, అదానీ కంపెనీలు ప్రకటించాయి. గ్రీన్ హైడ్రోజన్‌ను ఒక డాలర్ ధరకే విక్రయిస్తామని ఈ కంపెనీలు చెబుతున్నాయి.
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఎలక్ట్రోలైజర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చౌకైన ఎలక్ట్రోలైజర్‌లను భారతదేశంలో తయారు చేయాలి. లేదంటే దాని సాంకేతికత దిగుమతిపై సుంకం చాలా తక్కువగా ఉండాలి.
కంపెనీల చొరవ, ప్రభుత్వ విధానాల మధ్య సమన్వయం ఏర్పడినప్పుడు మాత్రమే భారతదేశపు గ్రీన్ హైడ్రోజన్ మైలురాయి పూర్తవుతుంది. మరి ఈ మిషన్ ముందడుగు ఏ విధంగా సాగుతుందో చూడాలి.
అయితే వరల్డ్ ఎకానమీ ఫోరమ్‌లో ఈ విషయంపై భారత పెట్రోలియం మంత్రి హర్దీప్ పూరీ చేసిన ప్రకటనతో, ఈ విషయంలో భారతదేశం చాలా సీరియస్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
© 2022 BBC. ఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు. ఇతర వెబ్‌సైట్లకు మా లింకింగ్ విధానం గురించి తెలుసుకోండి.

source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *