టెన్త్‌లో సర్కారు ఫెయిల్‌ – Eenadu

పదో తరగతి ఫలితాలు ఈ ఏడాది ఘోరంగా ఉన్నాయి. దీనికి బాధ్యులు ఎవరు? పరీక్షల్లో సంస్కరణలా? సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరతా? లేక కరోనాతో రెండేళ్లపాటు తరగతులు జరగకపోవడమా? వరసగా ప్రశ్నపత్రాల లీకేజీలు
20 ఏళ్లలో ఇదే అత్యల్పం
71 పాఠశాలల్లో అందరూ ఫెయిల్‌
గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాల్లోనే ఎక్కువ అనుత్తీర్ణత


ఈనాడు, అమరావతి: పదో తరగతి ఫలితాలు ఈ ఏడాది ఘోరంగా ఉన్నాయి. దీనికి బాధ్యులు ఎవరు? పరీక్షల్లో సంస్కరణలా? సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరతా? లేక కరోనాతో రెండేళ్లపాటు తరగతులు జరగకపోవడమా? వరసగా ప్రశ్నపత్రాల లీకేజీలు జరగడం.. వాటిపై కఠిన చర్యలు చేపట్టడమా? ఇప్పుడు అందరిలోనూ ఇదే చర్చ. పరీక్షల్లో సంస్కరణలు తీసుకొచ్చారు సరే. ఇందుకు అనుగుణంగా విద్యార్థులను ముందు నుంచే సన్నద్ధం చేయాలి కదా? నమూనా పరీక్షలు నిర్వహించాలి. పాఠశాలల పునఃప్రారంభం నుంచే దీనిపై దృష్టి పెట్టాలి. కానీ, అధికారులు మాత్రం నూతన విద్యా విధానం పేరుతో బడులను విలీనం చేయడానికే సమయమంతా వెచ్చిస్తున్నారు. చాలా పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్ల కొరత ఉంది. ఉపాధ్యాయులు తగినంతమంది లేక పదో తరగతికి ప్రాధాన్యమిచ్చి.. కింది తరగతులను వదిలేస్తున్నారు. ఆ పిల్లలు పైతరగతులకు వచ్చిన తర్వాత సబ్జెక్టు అర్థంకాక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతోంది. మరోపక్క కరోనా కారణంగా 8, 9 తరగతుల్లో పరీక్షలు రాయకుండానే విద్యార్థులు పదో తరగతికి వచ్చేశారు. ఇలాంటి వారికి ఎంతో పకడ్బందీగా అదనపు తరగతులు నిర్వహించాలి. వాటిపైనా పర్యవేక్షణ లేకుండాపోయింది. ఈ చర్యలన్నీ పదో తరగతి ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపాయి.
2 లక్షల మంది ఫెయిల్‌..
రాష్ట్రంలో 6,15,908 మంది పరీక్షలు రాస్తే 2,01,627 మంది అనుత్తీర్ణులయ్యారు. ఉమ్మడి ఏపీలో 2002లో 66.06 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈసారే ఇంత తక్కువగా 67.26 శాతం నమోదైంది. 2002-2003 నుంచి ఉత్తీర్ణత పెరుగుతూ వచ్చింది. 2018లో 94.48 శాతం, 2019లో 94.88 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 2020, 2021లో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకపోవడంతో అందర్నీ ఉత్తీర్ణులు చేశారు. 2019తో పోల్చితే 27.62 శాతం ఉత్తీర్ణత తగ్గింది. ఈసారి పరీక్షల ప్రారంభం నుంచి ప్రశ్నపత్రాలు సామాజిక మాధ్యమాల్లో వచ్చాయి. మొదటి మూడు రోజులు కొంత వరకు చర్యలు తీసుకున్నా ఆ తర్వాత  ఉపాధ్యాయులను అరెస్టు, సస్పెన్షన్లు చేశారు. దీంతో పరీక్షల విధుల్లో ఉన్నవారిలో కొంత భయం ఏర్పడి మామూలు కన్నా కఠినంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. మొదటి మూడు రోజులు జరిగిన తెలుగు, హిందీ, ఆంగ్ల భాష పరీక్షల్లో ఎక్కువ మంది ఉత్తీర్ణులు కాగా.. ఆ తర్వాత జరిగిన గణితం, సామాన్య, సాంఘికశాస్త్రాల్లో ఎక్కువ మంది అనుత్తీర్ణులయ్యారు. తెలుగులో 91.73%, హిందీలో 97.03% ఆంగ్లంలో 97.95% మంది ఉత్తీర్ణత సాధించగా.. గణితంలో 80.26%, సామాన్యశాస్త్రంలో 82.18%, సాంఘిక శాస్త్రంలో 81.43% మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
22 ప్రభుత్వ బడుల్లో సున్నా..
రాష్ట్రంలో 71 బడుల్లో ఒక్కరూ ఉత్తీర్ణులు కాలేదు. ఇందులో ప్రైవేటు బడులు 31 ఉండగా.. ఎయిడెడ్‌ 18, ప్రభుత్వ బడులు 22 ఉన్నాయి. 2018లో 17 బడుల్లో సున్నా ఉత్తీర్ణత ఉండగా.. వీటిల్లో ప్రైవేటు 10, ఎయిడెడ్‌ 2, ప్రభుత్వ పాఠశాలలు ఐదు ఉన్నాయి. 2019లో కేవలం మూడు పాఠశాలల్లోనే సున్నా ఫలితాలు వచ్చాయి. ఇందులో ప్రైవేటు బడులు 2, ఎయిడెడ్‌ ఒకటి ఉన్నాయి. ఒక్క ప్రభుత్వ పాఠశాలలోనూ సున్నా ఫలితాలు రాలేదు. రెండేళ్లు గడిచేసరికి 22 ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా తయారైంది. కొవిడ్‌ కారణమైతే కనీసం కొంతమందైనా ఉత్తీర్ణులు కావాలి కదా? వందశాతం మంది ఎలా ఫెయిల్‌ అవుతారు? 2019లో సున్నా ఫలితాలు వచ్చిన ప్రభుత్వ బడి ఒక్కటీ లేకపోగా.. రెండేళ్లలోనే ఇంతటి దారుణ పరిస్థితి ఏర్పడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉపాధ్యాయుల తీవ్ర కొరత..
రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లో సుమారు 10 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లా చిట్వేలి పాఠశాలలో 13 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉండగా.. నంద్యాల జిల్లా సున్నిపెంటలో 12 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. అనంతపురంలో స్కూల్‌ అసిస్టెంట్ల కొరత చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ 50 శాతం ఫలితాలే వచ్చాయి. 60 మందికో సెక్షన్‌, విద్యార్థుల ఆధారంగా ఉపాధ్యాయుల కేటాయింపు అంటూ ఉన్నతాధికారులు నిర్ణయాలు తీసుకోవడం బోధనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పదో తరగతి పరీక్షలు కీలకం కావడంతో కింద తరగతులకు బోధనలో ప్రాధాన్యం తగ్గించారు. కింద స్థాయిలో బోధన సరిగా లేకపోతే పైతరగతులకు వచ్చాక వారు ఎలా సబ్జెక్టు నేర్చుకుంటారు? రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరించిన 500 బడులకు ప్రధానోపాధ్యాయులే లేరు. ఇక్కడ పర్యవేక్షణ ఎలా సాగుతుంది? నూతన విద్యా విధానమంటూ అన్నింటినీ వాయిదా వేస్తూ వస్తున్నారు.
పరీక్షల్లో సంస్కరణలు
పదో తరగతి పరీక్షల విధానంలోనూ మార్పులు చేశారు. 2019 వరకు 11 పేపర్లు ఉండగా.. వాటిని ఏడు పేపర్లకు కుదించారు. గతంలో ఒక పేపర్‌లో తక్కువ మార్కులు వచ్చినా మరో పేపర్‌లో కవర్‌ చేసుకునేవారు. ఈసారి ఒకే పేపర్‌ కావడంతో విద్యార్థులపై కొంత ఒత్తిడి పెరిగింది. వంద మార్కులకు ఒకేసారి సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో బిట్‌ పేపర్‌ విధానం ఉండగా.. ఈసారి తొలగించారు. ఒక మార్కు ప్రశ్నలకు నేరుగా సమాధానాలు రాసే విధానం తీసుకొచ్చారు. దీనిపై విద్యార్థులకు అవగాహన లేదు. కరోనా కారణంగా వీరు 8, 9 తరగతుల్లో పరీక్షలు రాయకుండా నేరుగా పది పరీక్షలకు హాజరయ్యారు. పాఠశాలల్లోనూ మారిన పరీక్ష విధానంపై సరైన తర్ఫీదు ఇవ్వలేదు. మారిన పరీక్షల విధానంపై విద్యార్థులను ముందు నుంచే సన్నద్ధం చేయడంలో అధికారులు విఫలమయ్యారు.
పదో తరగతి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు సైతం బోధనేతర పనులు అప్పగించారు. మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం పథకం ఫొటోలు తీయడం, ఆన్‌లైన్‌ హాజరు నమోదులాంటి వాటిని చేయించారు. ఈ కార్యకలాపాలకు ప్రతిరోజూ గంట నుంచి గంటన్నర బోధన సమయం వృథాగా పోయింది. ఉపాధ్యాయులు ఎంత చెప్పినా ఉన్నతాధికారులు పెడచెవిన పెట్టారు. ఫలితాలు తగ్గడానికి ఇదీ ఒక కారణమే.
కరోనా ప్రభావం ఎంత?
ఈ ఏడాది ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కరోనా సమయంలో విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను కోల్పోయిన విషయం ఉపాధ్యాయులు, అధికారులకు ముందే తెలుసు. ఈ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు 8, 9 తరగతుల్లో ఎలాంటి పరీక్షలు రాయలేదు. చాలామందిలో ఏకాగ్రత తగ్గిందని ఉపాధ్యాయులు పాఠశాలల పునఃప్రారంభంలోనే గుర్తించారు. వాటిని సవరించేందుకు అధికారులు ఎందుకు ప్రత్యేక చర్యలు తీసుకోలేదనేది ప్రశ్నార్థకం. ఫలితాలు వచ్చిన తర్వాత అనుత్తీర్ణులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామంటున్నారు. విద్యా సంవత్సరం కొనసాగుతున్నప్పుడు దీనిపై ఎందుకు దృష్టిపెట్టలేదో.. ఇప్పుడు అదనపు తరగతులు నిర్వహిస్తామనడం ఎంత వరకు సరైందో అధికారులకే తెలియాలి.
ప్రభుత్వమే బాధ్యత వహించాలి 
– ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాయిశ్రీనివాస్‌, తిమ్మన్న 
‘‘గతంలో 11 పేపర్లు ఉండడంతో పరీక్షలు రాయడం విద్యార్థులకు తేలికగా ఉండేది. ఈసారి 7 పేపర్లతోనే నిర్వహించారు. ఉపాధ్యాయులపై క్రిమినల్‌ కేసులు పెట్టి జైలుకు పంపించడం వంటి చర్యలు ఫలితాలు తగ్గడానికి కారణమయ్యాయి. తరగతి గదిలో పాఠాలు బోధించే వాతావరణం ఉండడం లేదు. నిత్యం బోధనేతర పనుల కారణంగా బోధనపై దృష్టిపెట్టలేకపోతున్నారు’’
బోధనేతర పనుల వల్లే ఉత్తీర్ణత తగ్గుదల
– ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, గౌరవాధ్యక్షుడు, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక 
‘‘ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించడం వల్లే ఫలితాల్లో అనంతపురం జిల్లా వెనుకబడింది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే వినియోగించాలి. ఉత్తీర్ణశాతం పడిపోవడానికి బోధనేతర పనుల ప్రభావం ఒకటి.’’


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For Editorial Feedback eMail:
[email protected]
For Marketing enquiries Contact :
040 – 23318181
eMail: [email protected]
© 1999 – 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents
or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics.
ABC

source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *