Andhra News: రాజధాని కట్టడానికి అమరావతి పనికిరాదు.. అవన్నీ ఆవ భూములు.: తమ్మినేని – Eenadu

‘శ్రీకాకుళం రాజధాని కావాలనేవారిది మరుగుజ్జు మనస్తత్వం. రాజధాని కట్టడానికి అమరావతి పనికిరాదు. అవన్నీ ఆవ భూములు. రాజధాని విషయంలో చంద్రబాబు లాజిక్కు మిస్సయ్యి, అతి తెలివితో తప్పటడుగు వేశారు.


ఈనాడు డిజిటల్‌-శ్రీకాకుళం, న్యూస్‌టుడే-శ్రీకాకుళం నగరం: ‘శ్రీకాకుళం రాజధాని కావాలనేవారిది మరుగుజ్జు మనస్తత్వం. రాజధాని కట్టడానికి అమరావతి పనికిరాదు. అవన్నీ ఆవ భూములు. రాజధాని విషయంలో చంద్రబాబు లాజిక్కు మిస్సయ్యి, అతి తెలివితో తప్పటడుగు వేశారు. అమరావతిని ప్రపంచం మెచ్చే రాజధానిగా తీర్చిదిద్దుతామని రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు కుట్ర చేశారు’ అని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలో శుక్రవారం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో విశాఖ రాజధానికి మద్దతుగా తీర్మానం చేశారు. దాన్ని హైకోర్టుకు సమర్పిస్తామని స్పీకర్‌ తెలిపారు. సమావేశంలో శ్రీకాకుళాన్ని రాజధానిగా చేయాలని కోరిన తెదేపా జడ్పీటీసీ సభ్యుడు పొగిరి బుచ్చిబాబుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ రాజధానికి వ్యతిరేకంగా తెదేపా తీర్మానం చేయగలదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ ‘గతంలో ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమాల పురిటిగడ్డ శ్రీకాకుళం. విశాఖ రాజధాని సాధనకు అవసరమైతే మరోమారు ఉద్యమాల ఖిల్లాగా మారుతుంది. అమరావతి రైతుల పాదయాత్రను సూర్యభగవానుడు సైతం హర్షించలేదు. అందుకే వారిని వెనక్కి పంపేశాడు. రూ.15-20 వేలకోట్లు ఖర్చు చేస్తే విశాఖ అద్భుతమైన రాజధానిగా మారుతుంది. ఈ విషయమై న్యాయం చేయాలని న్యాయమూర్తులను చేతులెత్తి మొక్కుతున్నాం’ అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ మాట్లాడారు. రాజధాని సాధనకు అవసరమైతే తమ పదవులతో పాటు ప్రాణాలు సైతం పణంగా పెట్టేందుకు వెనకాడేది లేదన్నారు. విశాఖ రాజధాని ఉద్యమానికి జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు పిరియా విజయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ఎజెండాలో 44 శాఖలు, ఇతర సమస్యలు ఉన్నా, చర్చ అంతా రాజధానిపైనే కొనసాగింది. ఒక్క ప్రజా సమస్యపైనా చర్చ జరగలేదు.
స్పీకర్‌ తనయుడికి నిబంధనలు వర్తించవా..?

శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో వేదికపైన స్పీకర్‌ తనయుడు తమ్మినేని చిరంజీవినాగ్‌ కూర్చోవడం చర్చనీయాంశమైంది. సభలోని ఇతర సభ్యులు… స్పీకర్‌ తనయుడికి నిబంధనలు వర్తించవా? అంటూ గుసగుసలాడుకున్నారు. జడ్పీ సమావేశం సందర్భంగా స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ… ‘సమావేశ మందిరంలో సభ్యులు, అధికారులు కాకుండా ఇతరులు ఉండటానికి వీలులేదు. ఏయ్‌ ఆ వెనక ఎవరు.. బయటకు పొండి.. ఇది సభ అనుకుంటున్నారా.. ఇంకేమైనానా.. సభ్యులు కాని వారు ఉండకూడదు.. మీరంతా బయటకు వెళ్లే వరకు సభ ప్రారంభం కాదు…’ అంటూ పదే పదే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దాంతో సభ్యులు కాని వారిని, నాయకుల అనుచరులను బయటకు పంపించేశారు. అయితే… స్పీకర్‌ తనయుడు తమ్మినేని చిరంజీవినాగ్‌ మాత్రం వేదికపైకి వచ్చి శాసనసభాపతి తమ్మినేని వెనక సీట్లో కూర్చోవడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For Editorial Feedback eMail:
[email protected]
For Marketing enquiries Contact :
040 – 23318181
eMail: [email protected]
© 1999 – 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents
or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics.
ABC

source

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*