Telangana News: రిమాండ్‌కు తిరస్కరణ – Eenadu

‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సరైన ఆధారాలు లేవంటూ.. ముగ్గురు నిందితులకు రిమాండ్‌ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిరాకరించారు. వారిని తక్షణమే విడుదల చేయాలని, 41 సీఆర్‌పీసీ కింద నోటీసులిచ్చిన తర్వాతే విచారించాలని స్పష్టం చేశారు.
సరైన ఆధారాల్లేవన్న న్యాయమూర్తి 
ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల విడుదలకు ఆదేశం
41 సీఆర్‌పీసీ కింద విచారించాలని సూచన
  రూ.100 కోట్లు ఆశ చూపారని రోహిత్‌రెడ్డి ఫిర్యాదు
  ఇతర ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున!
  తెరాసను వీడి భాజపాలో చేరితే ఇస్తామంటూ ప్రలోభాలు
  ఆ మేరకు పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ నమోదు
  దిల్లీలోని కీలక నేత కార్యదర్శి ఆడియో లభ్యమైందని ప్రచారం


ఈనాడు – హైదరాబాద్‌, న్యూస్‌టుడే – మొయినాబాద్‌, నాగోల్‌, సరూర్‌నగర్‌: ‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సరైన ఆధారాలు లేవంటూ.. ముగ్గురు నిందితులకు రిమాండ్‌ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిరాకరించారు. వారిని తక్షణమే విడుదల చేయాలని, 41 సీఆర్‌పీసీ కింద నోటీసులిచ్చిన తర్వాతే విచారించాలని స్పష్టం చేశారు. నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను పోలీసులు గురువారం రాత్రి సరూర్‌నగర్‌లోని న్యాయమూర్తి జి.రాజగోపాల్‌ నివాసానికి తీసుకెళ్లి ఆయన ఎదుట హాజరుపరిచారు. లంచం సొమ్ము దొరకనందున ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్‌) వర్తించదని స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాల నేపథ్యంలో నిందితుల్ని విడిచిపెట్టామని శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. తెరాసకు చెందిన తాండూరు, అచ్చంపేట, కొల్లాపూర్‌, పినపాక ఎమ్మెల్యేలు పైలట్‌ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావులను ప్రలోభపెట్టారని ముగ్గురు నిందితులపై సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం రాత్రి వరకు ముమ్మరంగా దర్యాప్తు జరిగింది. నిందితులు రూ. కోట్ల నగదు తీసుకొచ్చారని ప్రచారం జరిగినా దానికి సంబంధించిన ఆధారాలను పోలీసులు వెల్లడించలేదు. కానీ జాతీయస్థాయిలో ఒక కీలక నాయకుడి కార్యదర్శి మాట్లాడిన ఆడియో టేపులు లభించాయని పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్యేలను ఒప్పించాలని రోహిత్‌రెడ్డికి ప్రలోభం
రోహిత్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అభియోగాలు ఇలా ఉన్నాయి. దిల్లీకి చెందిన రామచంద్రభారతి అలియాస్‌ సతీశ్‌శర్మ, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ సెప్టెంబరు 26న తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని కలిశారు. తెరాసకు రాజీనామా చేసి వచ్చే సాధారణ ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేస్తే.. రూ.100 కోట్ల నగదు, కేంద్రప్రభుత్వ పరిధిలోని కాంట్రాక్టులు ఇప్పిస్తామని ఆశపెట్టారు. కేంద్రప్రభుత్వంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తామన్నారు. భాజపాలో చేరకపోతే ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించి, క్రిమినల్‌ కేసులు పెట్టిస్తామని హెచ్చరించారు. తెరాసను తాము తుదముట్టించబోతున్నామని పేర్కొన్నారు. వారిద్దరూ బుధవారం ఉదయం మరోసారి రోహిత్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. తిరుపతికి చెందిన సింహయాజి స్వామితో కలిసి తాము మధ్యాహ్నం మొయినాబాద్‌ సమీప అజీజ్‌నగర్‌లోని రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌కు వస్తున్నామని, ఇంకా ఎవరైనా ఎమ్మెల్యేలుంటే తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యేలెవరైనా భాజపాలో చేరేందుకు ఒప్పుకొంటే రూ.50 కోట్లు ఇస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలను ఒప్పించడం ద్వారా తెరాస పార్టీని అస్థిరపరచడానికి సహకరించాలని కోరారు. భారీమొత్తంలో లంచమివ్వజూపిన ఈ అనైతిక చర్యను అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రోహిత్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురు నిందితులపై 120-బి (నేరపూరిత కుట్ర), 171-బి రెడ్‌విత్‌ 171-ఈ 506 (నేరపూరిత బెదిరింపు) రెడ్‌విత్‌ 34 ఐపీసీ, సెక్షన్‌ 8 ఆఫ్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌-1988 (ప్రభుత్వ ప్రతినిధికి లంచమివ్వజూపడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఫాంహౌస్‌లో తనిఖీలు.. క్లూస్‌టీం దర్యాప్తు
రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ ప్రాంతాన్ని సైబరాబాద్‌ పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని.. గురువారం రోజంతా విస్తృతంగా తనిఖీలు చేశారు. డబ్బు ఎక్కడైనా దాచారా అనే అనుమానంతో క్షుణ్ణంగా పరిశీలించారు. దాదాపు అయిదెకరాల్లో ఉన్న ఆ క్షేత్రంలోకి ఇతరులెవ్వర్నీ అనుమతించలేదు. ఉదయం 10 గంటల సమయంలో అక్కడికి చేరుకున్న శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి.. మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకు అక్కడే ఉన్నారు. తిరిగి సాయంత్రం వచ్చి రాత్రి వరకు రిమాండ్‌ డైరీ రూపకల్పనలో నిమగ్నమయ్యారు. మరికొందరు ఉన్నతాధికారులూ వచ్చి వెళ్లారు. పోలీసులు తమ కంప్యూటర్లు, ప్రింటర్లు కూడా తీసుకెళ్లి.. ఫాంహౌస్‌లోనే పంచనామా నిర్వహించి, రిమాండ్‌ నివేదికను రూపొందించారు. అక్కడ నిలిపి ఉంచిన కారులోని బ్యాగుల్ని మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులు లోపలికి తీసుకెళ్లారు. క్లూస్‌టీం కూడా ఆధారాల సేకరణ ప్రారంభించింది.
డ్రైవర్‌ను ఆరా తీసిన పోలీసులు
ముగ్గురు నిందితులు వినియోగించిన టీఎస్‌ 07 హెచ్‌ఎమ్‌ 2777 కారు డ్రైవర్‌ తిరుపతిని పోలీసులు ప్రశ్నించారు. సింహయాజి, రామచంద్రభారతిలను తీసుకొచ్చేందుకు తిరుపతిని తాత్కాలికంగా నియమించినట్లు తెలిసింది. బుధవారం మధ్యాహ్నం వారు శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగాక.. డ్రైవర్‌ తిరుపతి వారిని కారులో ఎక్కించుకున్నాడు. మధ్యలో నందకుమార్‌ కలిశాడు. తర్వాత ముగ్గురినీ అదే కారులో మొయినాబాద్‌ ఫాంహౌస్‌కు తీసుకొచ్చినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఫాంహౌస్‌కు రావడానికి ముందు ఇంకా ఎవరినైనా కలిశారా? అనే కోణంలో పోలీసులు డ్రైవర్‌ను ఆరా తీశారు.
ఒకే కారులో వెళ్లిపోయిన నిందితులు
పోలీసులు బుధవారం రాత్రి ఫాంహౌస్‌ నుంచి నిందితులను శంషాబాద్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారికి అక్కడే వైద్యపరీక్షలు చేయించారు. రిమాండ్‌డైరీని రూపొందించిన అనంతరం గురువారం రాత్రి ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు. ఇందుకోసం నల్లతెరలతో కూడిన వాహనాలను వినియోగించారు. కోర్టు సమయం ముగియడంతో సరూర్‌నగర్‌లోని జడ్జి నివాసంలో నిందితులను హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితులను విడుదల చేయడంతో ముగ్గురూ ఒకే కారులో వెళ్లిపోయారు.
సూత్రధారి నందకుమార్‌: ప్రలోభాల వ్యవహారంలో నందకుమార్‌ సూత్రధారిగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. పరిగికి చెందిన ఈయన హోటల్‌, హాస్పిటాలిటీ రంగాల్లో కొనసాగుతూ వివిధ రాజకీయపార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఏడు కంపెనీల్లో వాటాదారు అయిన నందకుమార్‌ ఓ కంపెనీలో రాష్ట్రానికి చెందిన కీలక ప్రజాప్రతినిధి సమీప బంధువుతో భాగస్వామిగా ఉండటం గమనార్హం. ప్రారంభోత్సవాల్లాంటి కార్యక్రమాలకు ప్రముఖుల్ని ఆహ్వానించడం ద్వారా తన పరపతిని చాటుకుంటాడనే చర్చ జరుగుతోంది.
టేపుల్లో కీలక సంభాషణలు?
తెరాస ఎమ్మెల్యేలతో బేరసారాలకు ప్రయత్నించే క్రమంలో మాట్లాడిన ఆడియో, వీడియోటేపులు పోలీసులకు లభ్యమైనట్లు ప్రచారం జరుగుతోంది. స్వామీజీ బృందం దిల్లీ నుంచి పెద్దఎత్తున డబ్బు మూటలతో వచ్చినట్లు.. రూ.కోట్ల నగదు దొరికినట్లు విస్తృతంగా ప్రచారం జరిగినా, దానికి ఆధారాలేవీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఎఫ్‌ఐఆర్‌లోనూ పోలీసులు ఆ విషయాలను ప్రస్తావించలేదు. కీలకమైన సాక్ష్యాధారాల్ని సేకరించినట్లు అంతర్గత సంభాషణల్లో పోలీసులు చెబుతున్నారు. దిల్లీలోని ఓ కీలక ప్రజాప్రతినిధి కార్యదర్శి మాట్లాడిన ఆడియోలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించి నిర్ధారించుకునే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రప్రభుత్వ పెద్దలు మీడియా సమావేశం ఏర్పాటు చేసివీటిని బహిర్గతపరిచే అవకాశముందని సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For Editorial Feedback eMail:
[email protected]
For Marketing enquiries Contact :
040 – 23318181
eMail: [email protected]
© 1999 – 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents
or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics.
ABC

source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *